– రికార్డులు సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు
– కమిటీని రద్దు చేసి విచారణ చేపట్టాలి : కలెక్టర్, ఆర్డీవోలకు సూచన
హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: హనుమకొండ ది కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాను వెళ్లిన సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్‌లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ ముగ్గురు మాత్రమే హాజరవడం, అందులో ఇద్దరు మాత్రమే విధులలో ఉండటంపై నిలదీశారు. రికార్డులు, రిజిస్టర్, జమ, ఖర్చు తాలూకు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గత పాలకుల చేతిలో ఇంకా కీలు బొమ్మల్లా వ్యవహరిస్తూ ఆర్దికపరమైన అంశాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆయన గమనించారు. అలాగే సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని దారి మళ్లించి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు సిబ్బంది. పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు డీజిల్, పెట్రోల్ గత మూడేళ్లుగా వాడుకున్నారని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని, డీజిల్ డబ్బులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. కో ఆపరేటివ్ అధీనంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లో పదిమంది సిబ్బంది పేరుతో నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుంటున్న వారి వివరాలు రిజిస్టర్‌లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవు. తనిఖీల అనంతరం రిజిస్టర్‌లను వెంటనే జప్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఫోన్ ద్వారా కోరారు. దీంతో ఆర్డీవో సూపర్ బజార్ కార్యాలయానికి చేరుకుని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా రోజులుగా సూపర్ బజార్‌లో అవకతవకలు జరిగాయని తన దృష్టికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రంగంలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టాలని సంబధిత అధికారులకు కోరానని చెప్పారు. సొసైటీలో తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



