– ముగ్గురి మృతదేహాలు లభ్యం
– భద్రాద్రిలో విషాదం
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గురువారం ఉగాది సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో స్నానాలకు దిగారు. గోదావరిలో దిగిన సమయంలో స్నేహితులు ఫోటోలు దిగుతున్నారు. ఈ సమయంలో లోతును గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని ఎస్ఆర్‌ఎంటీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్‌లతో కలిసి ఎటపాక మండలంలోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి నదిలోకి దిగారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్‌లుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందం మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలను గజ ఈతగాళ్లు కనుగొన్నారు. వీరిని ఒడ్డుకు చేర్చారు. మృతిచెందిన తమ బిడ్డలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గోదావరి నది ఒడ్డున భోరున విలపిస్తున్నారు. లభ్యమైన మృతదేహాల్లో భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్, ఉయ్యూరు కు చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

