నువ్వు గింజవైతే! – 1

గాలిబ్ వాక్య వారసత్వం

దాసరాజు రామారావు

“Heart it is, not brick or stone

Why shouldn’t it feel the pain?

Let none tyrannize this heart

Or I shall cry again and again”

ప్రఖ్యాత ఉర్దూ, పార్శీ కవి సామ్రాట్ గాలిబ్ (మిర్జా అసదుల్లా బేగ్ ఖాన్ 1797-1869, ఆగ్రా) కవితా వాక్యాలివి. రాతియుగం నుంచి రాకెట్ యుగం లోకి దూసుకొచ్చినం. వేషభాషలు, నాగరికతలు, రుచులు అభిరుచులు, విజ్ఞాన, నవీన పోకడల అత్యాధునికత సంతరించుకున్నం. మనిషి మేధో జగత్ నక్షత్ర మండలాన్ని సైతం తాకింది. అయినా గాలిబ్ కాదన్న ఇటుకా లేదా రాయి ఎదురు పడుతూనే వున్నది. అడ్డు తగులుతూనే వున్నది. తలలు పగులుతూనే, బ్రతుకు ఛిద్రం అవుతూనే వున్న సాక్ష్యాలను కవితల్లో పూదిచ్చి, హృదయానికి హత్తుతున్న గాలిబ్ వాక్య వారసుడినని సగర్వంగా ప్రకటించుకున్న సీనియర్ కవి హనీఫ్. కాదేదీ కవిత కనర్హం కంటే కూడా కంటికి, మనసుకు నొప్పి లేదా హాపీ కలిగిస్తే అది కవిత్వమై తీరవలసిందే. రాశికి వాసికి స్పష్టత, చెండాడేతనానికి, మిన్నకుండేతనానికి విజ్ఞత పాటించే కొద్ది కవులలో తన కలం పదిలం. తెలంగాణీయత, ముస్లిమీయత రెండు పాయల సంగమంలో స్నానిస్తూ, గంగా జమునా తెహజీబ్ ని విరాజమానం చేస్తూ purposefull poet గా నిలుస్తున్న హనీఫ్ ని చదవడమంటే ఈ భూమిబిడ్డను ముద్దాడటమే. గాయాల నెమరేతల్లోంచి, చేజారిన స్వప్నాల్లోంచి, అబద్దాల పుట్టలోని మిన్నాగును పసిగట్టే, పనిపట్టే స్పృహని గింజలా నాటడమే.

సాహసికుడైన, సైనికుడైన కవి రాత పొల్లు మేఘాల్లా తేలిపోదు. మణిపూర్ మంటల్లోని అగ్గిరవ్వలై దూసుకొస్తయి. దస్తర్ఖాన్ పై పేర్చే ఐక్యతా వాక్యమై భాసిస్తది. జాతుల హననాల్లో పాలస్తీనా, మయన్మార్,  మరోటైనా, రాలే దుఃఖపు తడి ఒకే వేదన విన్పిస్తది. నది అంటే నీరు కాదనే సత్యానికి, చెమట, దుఃఖాన్ని కలిపి నది ప్రవహిస్తుందనే మరోవైపును ఆవిష్కరిస్తది. పోటీపడ్డ, ఎంగిలిపడ్డ దోస్తానీ వాస్తవమే గుంపులో కరవాలమో, బాకో అయ్యి కాఫిర్లయిన ద్రోహబుద్దులు నచ్చకపోయినా ఒప్పుకోబడ్తయి.

“ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును” అన్న సిద్దాంతం, ఆచరణ త్రికరణ శుద్ధిగా నమ్మిన కవి, మనిషి గజగజా వణికే భయం సందర్భంలో ఓటమిని బంధువుగా స్వీకరించమని వెన్ను తట్టుతడు. కనుమరుగైన శబ్దాన్ని, డప్పుల అదృశ్యాన్ని, నాల్కలు కత్తిరించిన కుక్కల్ని, భాషను కోల్పోయిన మూగ మోడులను  పూర్వ స్థితికి తెచ్చేందుకు సిద్దార్థునిలా ఆరాట పడుతడు. శ్రీశ్రీ ఉపాసించిన శ్రమైక జీవన సౌందర్యానికి కొనసాగింపుగా అల్లిన పూలహారం, పిండికొట్టిన కొండలు, ఆకాశ హర్మ్యాలు, నాల్గువేళ్ళతో నోటికందే అన్నం ముద్దల వెనక నైపుణ్యం, ధృడత్వం మిళితమైన శ్రమను పాడుతడు. ప్రవహించే, ఎగబాకే నిప్పును, స్వేచ్చ అనే నిప్పును దుర్మార్గ, దురహంకార దుర్భేద్యాలను తుదముట్టించేందుకు బాధితుల పరమవ్వాలని వాంఛిస్తడు.

వగపేటికి చల్ల చిందినన్, పాలు వొలికినన్, కలలు విరిగినన్? కవి తత్వం అది కాదు. కరుణ, జాలి, దయ, వగపు కవిని నిలువు నిస్తారం రక్తం, కన్నీరై కొలువై వుంటయి. ఆకారం, పనిలో దృశ్యమానమైన నాయిన బూడిద కుప్పలోంచి వీధిలో చింతమోడై నిల్పేది ఆ వగపే. కాయకష్టం అవమానం పాలై, బరిబత్తల వీధిల కూలబడ్డప్పుడు ఆ వగపే. మొక్కను నరికే తేలికతనానికి ఆ వగపే. నవ్విన, ఏడ్చిన కళ్ళను దానం చెయ్యక, మట్టిపాలు చేస్తుంటే ఆ వగపే. ఉభయకుశలోపరి అంటూ మొదలుపెట్టి సంతోషాలు, బాధలు, ఆలోచనలు చేవ్రాలులో పొదిగి, ఆఖర్న వ్యక్తిత్వం శోభిల్లే సంతకంతో కారటో, ఇన్లాండ్ లెటరో, కవరో చేతికందిన అపూర్వఘట్టం ఎటుపోయిందో? ఉత్తరం లేనితరాన్ని చూసీ వగపే. కలప తరలించుకొని పోయిన చెట్ల మొదల్లు వృద్దాశ్రమాల వొంటరి వాకిట్లో పడివుంటే ఆ వగపే. పండిన తల్లి కడుపు పంట తూటాకు గురైనప్పుడు, తండ్రుల కలలభూమి సౌడుపర్రలు, తొండలు గుడ్లు పెట్టిన బొరియల్లా మిగిలినప్పుడు ఆ వగపే. ఏ పునర్నిర్మాణం సంపూర్ణంగా జరగని నేలపై వగపై చిందుతున్న కవి మార్దవ ప్రతీక. అరుదైన అంతరంగ విలువ.

సహజమైన కళ్ళలోంచి సామ్యవాద లోకాన్ని చూడదలచుకున్న కవికి రంగు బేధాలు, హెచ్చు తగ్గులు, విభజించు పాలించు పట్ల వ్యతిరేకత వుంటది. తోటలోని పూలు తామంతా ఒక్కటే అనుకుంటయి. గ్రేడింగ్ చేసి గంపల కెత్తడం, రేట్ల పట్టిక నిర్ణయించడం, మనుషుల పుట్టుక చావు ఒకటే అయినప్పుడు జాతుల తేడా చూపడం  గురించి అసహనంతో ‘కొత్తగా చస్తే, కొత్తగా పుడితే, చెప్పు’ అంటూ అబద్దాల మనిషిని నిఖ్ఖచ్చిగా వ్యతిరేకించుటే ప్రధానమైతది. అలవోక పోకడల్ని, అల్లాటప్పాతనాల్ని, ఉబుసుపోక చేష్టల్ని, గాలివాటు గుణాల్ని, బరిమీద నిలిచి, ఒత్తుగా కాలానించని వాళ్ళు ‘అన్నం తినడం, అద్దం ముందు నిలువడం పట్ల వ్యతిరేకతే. అది అమానవుడు, అకవియునూ.

(ముగింపు వచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *