బైక్‌పై మంత్రులు పొంగులేటి, అడ్లూరి ప‌ర్య‌వేక్ష‌ణ‌

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29ః ఈసారి మేడారం మ‌హా జాత‌ర‌లో మంత్రుల‌ అట్టహాసాలు.. హంగులు లేవు.. కాన్వాయ్‌ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం పర్యటన. గురువారం తెల్ల‌వారు జాము నుంచి కార్య‌క్షేత్రంలోకి దిగి అంద‌రినీ ఆశ్చర్య ప‌రిచారు. మొన్నటి వరకు మేడారం అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన ఆయ‌న ఇప్పుడు జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షించారు. గ‌త రాత్రి గ‌ద్దెకు చేరిన పెద్ద‌మ్మ‌ల‌ను స‌తీసమేతంగా ద‌ర్శ‌నం చేసుకున్న పొంగులేటి తెల్లారేస‌రిక‌ల్లా ఓ సేవా కార్య‌క‌ర్త‌లా క‌ద‌న‌రంగంలోకి దూకారు.

కలెక్టర్‌తో కలిసి బైక్‌పై ప‌య‌నం

వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కారు దిగి బైక్ ఎక్కారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్‌.దివాక‌ర్‌ను తన వెనుక కూర్చోబెట్టుకుని స్వయంగా బైక్ నడుపుతూ గల్లీగల్లీని చుట్టి వ‌చ్చారు. ప్రొటోకాల్‌ గోడలు బద్ధలు కొట్టి సామాన్యుడిలా భక్తుల చెంతకు చేరారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం స్వయంగా తిరిగి పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో స‌హ‌చ‌ర మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి, అడ్లూరి, అధికారులు క‌లిసి బైక్‌ల‌పై తిరుగుతూ అక్క‌డి ఓ టీ దుకాణం వ‌ద్ద ఆగారు. ప్ర‌జా గొంతుక వినేందుకు చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. చాయ్వాలాతో చ‌మ‌త్క‌రించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. సౌకర్యాలు ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు. ఏ ఒక్క భక్తుడికీ అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.

————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *