అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

– డబుల్‌ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో మోసం
– ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్‌

మెదక్‌, ప్రజాతంత్ర, జూలై17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మెదక్‌లో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని, వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ స్పూర్తితో మహిళలకు పధకాలు అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు. హామీల అమలుపై ప్రతి నెలా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఖజానా చూస్తే రూ.60 వేల కోట్ల అప్పుల రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకెళ్లిందని ఆరోపిస్తూ ఆ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి వివేక్‌ అన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం డబల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మెదక్‌ నియోజకవర్గంలో తొమ్మిది వేల ఇండ్లు ఇచ్చిందని చెప్పారు. ఖజానా ఖాలీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిరఘునందన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *