మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

– పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని నదులు కూడా మహిళల పేర్లతోనే ఉన్నాయని, మహిళకు అంత శక్తి ఉందని చెప్పారు. మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీహరి, నారాయణపేట కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. మంత్రి, కలెక్టర్‌ అమరచింత, నర్వ, ఉట్కూర్‌ మండలాల్లోని మహిళా సమాఖ్య సంఘాలకు రూ.కోటి 8లక్షలతో ప్రభుత్వం అందించిన మూడు ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను, రూ.10 లక్షల విలువైన సంచార చేపల విక్రయ కేంద్ర వ్యాన్‌ను ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి, కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ముందుగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. అనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రారంభమైన పావలా వడ్డీ పథకాలు నేడు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోని రేవంత్‌ ప్రభుత్వంలో అమలవుతున్నాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు బస్సులకు వారినే యజమానులను చేస్తున్నామన్నారు. మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఈ పథకం కింద మక్తల్‌ నియోజకవర్గంలో నెలకు రూ.72 లక్షలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఇప్పుడు మూడు నెలలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను రూ.175 కోట్లతో పార్టీలకతీతంగా, అవినీతికి తావు లేకుండా నిర్మించి ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 12 వేల ఇందిరమ్మ ఇండ్లు అవసరమైతే మొదటి విడతగా 3,500 ఇస్తున్నామన్నారు. తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించేందుకు తల్లులు తాపత్రయపడతారని, అందుకే రూ.200 కోట్లతో 24 ఎకరాలలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను మక్తల్‌లో నిర్మిస్తామని తెలిపారు. . ప్రభుత్వం 2845 మహిళా సంఘాలకు 2023-24, 2024-25 సంవత్సరంలో వడ్డీ లేని రూ.8.28,కోట్ల రుణాలను అందించిందని వెల్లడిరచారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరిట 119 నియోజకవర్గాలలో సంబరాలు నిర్వహిస్తున్నదని, మహిళా శక్తిలో భాగంగా జిల్లా కేంద్రంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశామని, త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు మంత్రి సూచించినట్లు తెలిపారు. అనంతరం ఆత్మకూర్‌, మక్తల్‌ మండలాల మహిళా సమాఖ్య సంఘాలకు ఇందిరా మహిళా శక్తి సోలార్‌ పవర్‌ ప్లాంట్ల కోసం రూ.6 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. ప్రమాద భీమా చెక్కులను, మినీ గోదాముల చెక్కులను, లోన్‌ భీమా చెక్కులను మహిళా సమాఖ్య సంఘాలకు అందించారు. కార్యక్రమంలో డిఆర్డిఏ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, మండల సమాఖ్యల అధ్యక్ష కార్యదర్శులు, డిపిఎం, సిసిలు, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *