కాంగ్రెస్‌ పార్టీకీ నిజాముద్దీన్‌ ఒక ఐకాన్‌

– తుది వరకు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడు
– ఆ కుటుంబానికి అండగా ఉంటాం
-మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హుజుర్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 18: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి దివంగత నిజామొద్దీన్‌ ఐకాన్‌గా నిలిచి పోతారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. తుదకంటూ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నిఖార్సయిన నాయకుడు నిజాం అంటూ ఆయన కొనియాడారు. సర్పంచ్‌గా, జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా మూడు దశాబ్దాల పైచిలుకు సేవలందించారని తెలిపారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన సీనియర్‌ నేత నిజామొద్దీన్‌ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెనెపల్లి చందర్‌ రావు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామొద్దీన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ నిజాం మరణం వ్యక్తిగతంగా తనకు, కాంగ్రెస్‌ పార్టీకీ తీరని లోటని అన్నారు. వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి పోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని, లింగగిరిలో ఆయన విగ్రహానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. తాను, కాంగ్రెస్‌ పార్టీ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎత్తిపోతల నిర్మాణంలో భాగస్వాములు కావాలి
కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలలో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పధకాలలో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌, లీడర్‌ భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. భూసేకరణ అంశంలో నాయకులు, కార్యకర్తలు రైతులను సమన్వయం చేయగలిగితే త్వరితగతిన పూర్తి చేసి కొత్త ఆయకట్టుకు నీరు అందించడం సులభతరమవుతుందన్నారు. భూనిర్వాసితులకు మానవీయ కోణంలో నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూసీ, ఎడమ కాలువ, కృష్ణా నది, పాలేరు, మున్నేరులపై కడుతున్న ఎత్తిపోతల పధకాలను ఆయన ప్రస్తావిస్తూ భూసేకరణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *