– కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్ న్యాయవాది నియామకం
– కోట్ల విలువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్ భూములలో ఆక్రమణలు తొలగించాలి
– నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వందల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైన పక్షంలో ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ధప్రాతిపదికన స్వాధీనం చేసుకుని వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణలో బాగంగా సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ గురువారం మధ్యాహ్నం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గండిపేట, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పురలతోపాటు రాజేంద్రనగర్ పరిధిలోని వాలంతరి, టీజీఈఆర్‌ఎల్‌కు చెందిన 426.30 ఎకరాలకుగాను 131.31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. అందులో ఐటీఐఆర్ అధీనంలో ఉన్న 81.26 ఎకరాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ ఆక్రమణలపై జిల్లా కోర్టుల్లో 20 కేసులు పెండిరగ్‌లో ఉండగా హైకోర్టులో మరో రెండు కేసులు నడుస్తున్నాయన్నారు. భూములను పరిరక్షించడంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిని నియమించనున్నట్లు ఆయన వెల్లడిరచారు. కోట్ల విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ హైడ్రా, రెవెన్యూ, ఆర్‌అండ్‌ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలని నీటిపారుదల శాఖాధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ క్వార్టర్స్‌లో అక్రమంగా ఉంటున్న వారిని తొలగించడంతోపాటు తక్షణమే వాటి సమగ్ర సమాచారం తన ముందుంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఆక్రమణలకు చోటులేకుండా పాలనాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల కాల్వల పక్కన ఉన్న భూముల్లో, ప్రాజెక్టులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్‌నందించవచ్చని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాధ్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ అఫ్జల్ హుస్సేన్, ఈఎన్‌సీ అడ్మిన్ రమేష్ బాబు, వాలంతరి డైరెక్టర్ జనరల్ అనిత, హైడ్రా ఎస్పీ అశోక్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.





