– వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలి
– ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ
– రియల్ లిడార్ సర్వేను త్వరితగతిన పూర్తిచెయ్యాలి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అటు వానాకాలం, ఇటు యాసంగి పంటలకు ప్రణాళికాబద్దంగా నీటిని అందించడంతో అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. వ్యవసాయశాఖాధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకున్నందునే రాష్ట్రం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి యావత్ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఖరీఫ్ పంటకు నీటి విడుదలతోపాటు ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్దరణ, నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడూతూ వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్ మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలులో పెట్టాలన్నారు. సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని సూచించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు ఎదురయ్యే పరిణామాల పట్ల ముందస్తు బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన అనకట్టలతోపాటు జలాశయాలు, కాల్వలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు సన్నద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ చర్యలు చేెవడుతున్నట్లు వెల్లడిరచారు. సుమారు 10 కి.మీ దూరం సొరంగ మార్గం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా మారనున్న ఎస్‌ఎల్‌బిసి పనుల పూర్తికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు ఆధునిక పరిజ్ఞానంతో పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపద్యంలో జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థ (ఎన్‌జిఆర్‌ఐ)తోపాటు భారత భూగర్భ సర్వే సంస్థ(జీఎస్‌ఐ)ల సహకారంతో పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులలో మునుముందు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు చేయనున్న ఏరియల్ లిడార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఈమేరకు ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలతో సమావేశమై సర్వేకు సంబంధించిన సాంకేతిక విధానాలను రూపొందించామన్నారు. నీటి సామర్ధ్యం పెంపొందించేందుకు చేపట్టిన పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. అతి భారీ వర్షాలతో ప్రమాదాలకు గురయ్యే వాటిని గుర్తించి అత్యవసరంగా పూడికతీత చేపట్టాలన్నారు. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి సంస్థలకు చెందిన భూముల్లో ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్‌తో నీటిపారుదల శాఖ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. శాఖాపరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ పెండిరగ్‌లో ఉన్న డిఈల నుండి ఇఎన్‌సిల వరకు వచ్చే రెండు నెలల్లో పింఛన్ల ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్య ్‌నాధదాస్‌్, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సిలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల సిఈలు, ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



