– సవాళ్లు కాదు.. యూరియా సరఫరా తెలుసుకోండి
– బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల హితవు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి మారడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర రైతాంగం యూరియా కోసం క్షేత్రస్థాయిలో తిప్పలు పడుతుంటే చేయని గొప్పలు చేసినట్లు చెప్పుకుంటున్నారని, అది వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రాష్టాన్రికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం సరఫరా చేసిందన్న రామచందర్‌రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడు తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రామచంద్రరావుకు, బీజేపీకి రాష్ట్ర రైతాంగం పట్ల ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్ మొత్తంగా 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. ఇది తెలియకుండా 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. ఇప్పటికే ఎన్నోసార్లు క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర లెక్కలతో సహా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి, సహాయ మంత్రికి లేఖలు రాశామని, తాజాగా రామచంద్రరావుకు కూడా లేఖ రాసినట్లు తుమ్మల పేర్కొన్నారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు చేస్తున్న రాజీనామా సవాళ్లు రాజకీయాల కోసం కాకుండా ఎరువుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వాడాలని హితవు పలికారు. ప్రస్తుత ఖరీఫ్ కోసం కేటాయించిన ఎరువుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వం అడుగుతోందని మంత్రి తుమ్మల
తెలిపారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ లాగా పదేపదే 2024-25 యాసంగి గురించి మాట్లడటం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. కేంద్రం సరఫరా చేసిన యూరియా రాష్ట్రంలో పక్కదారి పట్టిందని రాంచందర్ రావు ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్లిందని నిరూపిస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ చేసిన విషయం విదితమే.



