– నెలలోపు సీడ్స్ కంపెనీటు బకాయిలు చెల్లించాలి
– సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28 : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండిరగ్ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్ కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డాక్టర్ అంబేడ్కర్ సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి స్థంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ గోపి, పలు సీడ్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గద్వాల జిల్లా రైతులు సుమారు 50వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను సాగు చేయగా ఇప్పటివరకు సంబంధిత కంపెనీలు చెల్లింపులు జరపలేదని స్థానిక ఎమ్మెల్యే కృష్ణ్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమంటూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా సహించేది లేదని హెచ్చరించారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు రూ.700 కోట్లు రైతులకు బకాయిలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులు, వారిపై ఆధారపడిన రైతు కూలీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే స్పందించి నెల రోజుల్లోగా బకాయిలను రైతులకు చెల్లించి వారిని ఆదుకోవాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. రైతుభరోసా వంటి పథకాలతో రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. రైతులకు లాభం, సౌకర్యం, సంక్షేమం తమ ప్రాధాన్యమని మంత్రి అన్నారు. సమావేశంలో రాష్ట్ర సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, ప్రవీణ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.




