వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై వ్యవసాయ శాఖ మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్‌ల వరకు రాష్ట్రంలో పంటల వారీగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటి అమలుకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల బీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని మంత్రి వర్సిటీ అధికారులను ఆదేశించారు. తాము ఇంతకుముందు సింథటిక్ అపెర్చ్యూర్ డాటా (ఎస్‌ఏడీ) ఆధారంగా స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను, ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని శాస్త్రవేత్తలు మంత్రికి తెలియజేశారు. వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలున్నందున ఈ దిశగా శాస్త్రవేత్తలు ఈ పంట కాలం నుంచే వివిధ పంటలలో ప్రయోగాలు చేపట్టాలని ఉపకులపతికి మంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మనకు అందుతున్న వివరాలనుబట్టి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా లభించే సమాచారం కంటే కూడా సెన్సార్ల ద్వారా అందే సమాచారం ద్వారా చీడపీడల నివారణ సమర్థవంతంగా నిర్వహించవచ్చని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ సమీరేండు మెహంతి, శాస్త్రవేత్త డాక్టరు టి.ఎల్,నీలిమ, పరిశోధన సంచాలకులు డాక్టరు ఎం.బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డాక్టరు బి.బాలాజీ నాయక్ పాల్గొన్నారు.





