– నేషనల్ హైవే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మార్చాలి
– ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి
– ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి
ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, జులై 21: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్‌ను ఈనెల 24న నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలోని చెరువులన్నింటినీ నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెండిరగ్‌లో ఉన్న పనులన్నిటినీ సత్వరమే పూర్తిచేయాలన్నారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఎస్సీడీసీఎల్ సీిఎండి వరుణ్ రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని, ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డితో మాట్లాడి ఈనెల 24న ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కొదుమూరు వద్ద ఉన్న హైటెన్షన్ లైన్‌ను మార్చేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ లతా వినోదకు మంత్రి సూచించారు. వెలుగుమట్ల అర్బన్ పార్కులో వన్యప్రాణులకు తాగు నీరు, నర్సరీ మొక్కలకు నీటినందించేందుకు కొదమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వెలుగుమట్ల అర్బన్ పార్క్ వరకు పైప్ లైన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని. ఆ డిజైన్లను డీఎఫ్‌వోతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఖమ్మం నగర సుందరీకరణ కోసం రహదారులను విస్తరించాలని, మార్కెట్ యార్డు చుట్టూ రహదారుల విస్తరణను వ్యక్తిగతంగా పరిశీలించి ఎవరైనా గృహాలు కోల్పోతే వారికి డబుల్ బెడ్రూం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ కేటాయించాలని మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి తుమ్మల ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సత్వరమే ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.





