హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్రంలోని వలసదారుల, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి, వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు మద్దతుగా మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని (ఎంఎంఆర్‌సీ) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించారు. దీనిని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌వో)కి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో) సంయుక్త కార్యాచరణగా రూపొందించారు. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం ద్వారా నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్తున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో, తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకం, అవసరమైన సేవలు అందిస్తారు. డాక్టరు గోపి ఈ సంయుక్త కార్యక్రమ లక్ష్యాలను వివరించి జిల్లాల స్థాయి అధికారులతో సమన్వయంగా శిక్షణలు నిర్వహించబోతున్నట్లు మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఎంపిక చేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరీక్షలు, సేంద్రియ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపై వర్చువల్ శిక్షణలు ఇవ్వాలని సూచించారు. ఇకపై ఈ వాహనాల ద్వారా మొబైల్ మట్టి నమూనా పరీక్షలు, పశు సేవల వంటి ఇతర సేవలు కూడా రైతులకు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎన్ భాగస్వామ్య సంస్థల కృషిని మంత్రి ప్రశంసించారు. ఇక వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతున్నారని, అలాంటి వారికి గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుందని, ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.
సంచార సహాయ కేంద్రం ప్రారంభం



