ఇ-గవర్నెన్స్‌, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శృాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్‌బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్‌ కీలకమన్నారు. ఇందులో ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నామని, సైబర్‌ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. డ్రోన్‌ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించామని, ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్‌ లో తయారైన డ్రోన్లు తమ శత్రు దేశానికి భారీ నష్టం కలిగించాయని, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్‌ దాడులతోనే జరుగుతాయని శ్రీధర్‌బాబు వివరించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బ్రాండెడ్‌ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్‌ చేసిన అభ్యర్థనకు శ్రీధర్‌బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇIగవర్నెన్స్‌, ఏఐ, రోబోటిక్స్‌లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ (మీ సేవ) కార్పొరేషన్‌ కమిషనర్‌ రవికిరణ్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *