హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: రోడ్డు ప్రమాద బాధితుడికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. మంగళవారం రాత్రి అధికారిక కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడి ఉన్న ఓ యువకుడిని చూసి చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని ఆపి కిందకు దిగి ఆందోళన చెందొద్దంటూ బాధితుడికి ధైర్యం చెప్పారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దగ్గరుండి క్షతగాత్రుడిని ఆటోలో నిమ్స్ హాస్పిటల్‌కు పంపించారు. సాయంగా ఓ కానిస్టేబుల్‌ను కూడా వెంట పంపించారు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయమని వ్యక్తిగత సహాయకుడి ఫోన్ నంబర్ ఇచ్చారు. హాస్పిటల్‌కు చేరుకోగానే నిమ్స్ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేసిన మంత్రి శ్రీధర్‌బాబుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
క్షతగాత్రుడికి మంత్రి శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం




