డిగ్రీలు కాదు.. స్కిల్స్‌ అవసరం

– లెర్న్‌.. అన్‌ లెర్న్‌.. రీ లెర్న్‌
– ప్రస్తుత పరిస్థితుల్లో విజయానికి మంత్రం ఇదే
– యువతకు మంత్రి శ్రీధర్‌బాబు దిశా నిర్దేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంతోపాటు మనం కూడా మారాలి.. కాలం చెల్లిన జ్ఞానాన్ని విడిచిపెట్టి నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి.. అప్పుడే సక్సెస్‌ మనల్ని వరిస్తుంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉద్బోధించారు. ‘లెర్న్‌, అన్‌ లెర్న్‌, రీ లెర్న్‌’ అనేది ఇప్పుడు సక్సెస్‌కు ఫార్ములా అని వివరించారు. మాసబ్‌ ట్యాంక్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మన అమెరికా తెలుగు సంఘం(మాట)- టాస్క్‌ ఫ్రీ ఆన్‌లైన్‌ ఐటీ ట్రైనింగ్‌ సర్టిఫికెట్ల పదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. 50 శాతం మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ లేవని నాస్కామ్‌ గుర్తించింది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో కనీస అవగాహన ఉండటం లేదని తేల్చింది అని గుర్తు చేశారు. ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు కనుమరుగైపోతాయనే ఆందోళన వద్దు.. 2025 నాటికి 8.5 కోట్ల ఉద్యోగాలు రోబోలు, ఏఐ వల్ల పోతే కొత్తగా 9.7 కోట్లు పుట్టుకొస్తాయని వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం తేల్చింది అని మంత్రి చెప్పారు. చేతిలో డిగ్రీతోపాటు ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌పై పట్టు ఉంటేనే కొత్త ఉద్యోగాలను సాధించలేరు.. క్రిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, టీం వర్క్‌, అడాప్టబిలిటీ, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి స్కిల్స్‌ కూడా అవసరం.. ఆ దిశగా విద్యార్థి దశ నుంచే కృషిచేయాలి అని సూచించారు. లక్ష్యం అంటూ లేని జీవితం చిరునామా లేని లెటర్‌ లాంటిది.. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్‌వర్క్‌తో కూడిన హార్డ్‌వర్క్‌ చేస్తేనే సక్సెస్‌ వరిస్తుంది అని వివరించారు. కొత్త ఆలోచనలకు మేం ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ గ్లోబ్‌గా తెలంగాణను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, టాస్క్‌ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ‘మాట’ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి, ‘మాట’ ప్రతినిధులు శ్రీనివాస్‌, ప్రదీప్‌, విజయ్‌ భాస్కర్‌, నగేష్‌, కల్యాణి, డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *