– ఆవిష్కరించిన మంత్రి సీతక్క
– మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపునకు యత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గాడెస్ ఆఫ్ ఫోక్- సమ్మక్క సారలమ్మ జాతర కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జ్యోతిరావు పూలే భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు దక్కడం తెలంగాణకు గర్వకారణమని, ఆ గుర్తింపు సాధనలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లివింగ్ హెరిటేజ్ విభాగంలో ఇప్పటికే బెంగాల్‌లో దుర్గా పూజ, దిపావళి పండుగలకు హెరిటేజ్ హోదా లభించిన నేపథ్యంలో మేడారం జాతరకు కూడా అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ దిశగా చరిత్రకారులు, సామాజికవేత్తలు, అనుభవజ్ఞులు, అంత్రోపాలజిస్టులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమ్మక్క-సారలమ్మల త్యాగ గాథ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిందని, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను తరతరాలు స్మరించుకుంటాయని మంత్రి అన్నారు.
ప్రతి పండుగ ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ మేడారం జాతర తన ప్రత్యేక వైభవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. కోయ జాతి బిడ్డగా మేడారం చరిత్రలో భాగస్వామిని కావడం తనకు గర్వకారణమని తెలిపారు. మేడారం జాతర అరుదైన చిత్రాలను సంకలనం చేసి కాఫీ టేబుల్ బుక్ రూపంలో తీసుకొచ్చిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ గ్రంథంలోని ప్రతి చిత్రం ఒక చరిత్రను ప్రతిబింబిస్తోందని, ప్రపంచ పటంలో మేడారాన్ని నిలబెట్టిన ఫొటోగ్రాఫర్ల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కాకతీయ హెరిటేజ్ సభ్యులు, ఫొటోగ్రాఫర్లను మంత్రి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు, బుక్ ఎడిటర్ బి.నర్సింగరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బి.వి.పాపారావు, బి.పి.ఆచార్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.రతన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, జె.శ్రీధర్‌రావు తదితరులు హాజయ్యారు. మేడారం కాఫీ టెబుల్ బుక్‌కు తమ అద్భుత చిత్రాలతో తోడ్పాటునిచ్చిన ప్రముఖ పెయింటర్ ఏలే లక్ష్మణ్, ఫొటోగ్రాఫర్లు రామ వీరేశ్‌బాబు, పి.విజయభాస్కర్ రెడ్డి, శరత్‌బాబు, డి.ఎం.అర్జున్, శ్రీశైలం, అన్నవరం శ్రీనివాస్, సృజన్ పున్న, అనుమల్ల గంగాధర్, సత్యనారాయణ గొల్ల, డి.రవీందర్ రెడ్డి, కందుకూరి రమేష్‌బాబు, వినోద్‌బాబు వి, బిలుక ప్రభాకర్, ఎన్.ఆర్.సుధాకర్ గౌడ్ సేవలను కొనియాడారు. వారి ఫొటోలు జాతర వైభవాన్ని సజీవంగా ఆవిష్కరించాయని ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



