‘విజన్‌’లో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట

– 95 శాతం మంది మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం
– ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచేందుకు సమగ్ర వ్యూహం
– డాక్యుమెంట్‌ రూపకల్పనలో మంత్రి సీతక్క కీలక సూచనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పనలో మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించి విభిన్న అంశాలపై ఆమె పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, దాన్ని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన చేయాలని సూచించారు. మహిళల ఉపాధి-ఉద్యోగావకాశాలను విస్తృతంగా పెంచేందుకు సమగ్రమైన వ్యూహం ఉండాలన్నారు. మహిళల సంరక్షణ, పోషకాహారం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని, కోటిమంది మహిళలకు కోటిశ్వరులను చేసే లక్ష్యంతో విభిన్న వ్యాపారాల్లో మహిళలను ప్రొత్సహించేలా విజన్‌ డాక్యుమెంట్‌ ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలు కుట్టించడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది మహిళా సంఘాలకు రూ.30 కోట్లు పైగా ఆదాయం లభిస్తోందని చెప్పారు. ప్రైవేట్‌ రంగంలో కూడా మహిళా సంఘాల నైపుణ్యాన్ని వినియోగిస్తూ ముఖ్యంగా ప్రైవేట్‌ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల యూనిఫామ్‌ తయారీ పనులు మహిళా సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 2047 విజన్‌ ప్రకారం అన్ని మహిళలకు యూనివర్సల్‌ చైల్డ్‌ కేర్‌, యూనివర్సల్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆమె పేర్కొన్నారు. విజన్‌ 2047 మహిళతోనే తెలంగాణ ప్రగతి తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ‘కోటిమంది మహిళలను కోటీిశ్వరులను చేసే కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుని ప్రతి మహిళకు ఆర్థిక భద్రత, డిజిటల్‌ జ్ఞానం, వ్యాపార అవకాశాలు, గ్లోబల్‌ మార్కెట్‌ చేరుకోవడానికి సహాయం చేసే చర్యలు ప్రారంభించింది.
విద్య, భద్రత
బాలికలు విద్య పూర్తి చేసేలా స్కాలర్‌షిప్‌లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఫైనాన్షియల్‌-డిజిటల్‌ జ్ఞానం, చిన్న వ్యాపార నైపుణ్యాలు నేర్పుతోంది. బాల్య వివాహాలు ఆపేందుకు, లింగ సమానత్వంపై అవగాహన పెంచుతోంది.
ఉద్యోగం, వ్యాపారం కోసం సహాయం
మహిళలు పని చేసే చోట పిల్లల కోసం నాణ్యమైన క్రెచ్‌లు ఏర్పాటు. మహిళల వ్యాపారాలకు అవసరమైన అనుమతులు, సేవలు ఒక్కే వేదికలో అందుబాటులోకి. ఎస్‌హెచ్‌జీ లావాదేవీలను డిజిటైజ్‌ చేసి బ్యాంకు రుణాలు సులభంగా అందేలా చేస్తోంది.
గ్లోబల్‌ మార్కెట్‌ అవకాశాలు
ఉయ్‌ హబ్‌, టి-హబ్‌ పసహాకారంతో మహిళా స్టార్టప్‌ ను విదేశీ మార్కెట్‌లకు తీసుకెళ్లేలా ప్రణాళికలు. మహిళల కోసం ప్రత్యేక పరిశ్రమ క్లస్టర్లు. డిజైన్‌ ల్యాబ్‌లు, జీఐ ఉత్పత్తులకు గ్లోబల్‌ సర్టిఫికేషన్‌. టెక్స్‌ెటైల్‌, పర్యాటకం, సోలార్‌, ఆగ్రో-ఫుడ్‌ రంగాల్లో మహిళల కోసం ప్రత్యేక ప్రోత్సాహం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *