– అబద్ధాలతో దిగజారిపోతున్న హరీష్‌రావు
– ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గన్ కల్చర్ పెరిగిపోతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె కేబినెట్ సమావేశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఖండిరచారు. ‘నా తల్లిదండ్రులు సమ్మయ్య, సమ్మక్కలపై ప్రమాణం చేసి చెబుతున్నా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగింది. హరీష్ రావు చెప్పిన ఒక్క మాటలో కూడా నిజం లేదు అని సీతక్క స్పష్టం చేశారు. హరీష్ రావు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేబినెట్‌లో రాద్దాంతం జరిగిందని చెబితే దానికి సాక్ష్యం చూపగలడా? జరగని విషయాలను జరిగాయని చెబుతూ ఇంత దిగజారి మాట్లాడడం ఆయనకుి తగదు అని హితవు పలికారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందీ బీఆర్‌ఎస్ పార్టీనే అని సీతక్క ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులతో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు. హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉండగానే అడ్వకేట్ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్‌ఎస్ అని సీతక్క మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛే లేదని, అంతా పంజరంలోని చిలుకల్లా ఉన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో కేసీిఆర్ హయాంలో కేబినెట్ సమావేశాలు నామమాత్రంగానే జరిగేవి అని తెలిపారు. హరీష్‌రావు ఇప్పుడు తెలంగాణ పత్రిక అబద్ధపు కథనాలను అమ్మే సేల్స్‌మన్‌గా మారిపోయారని సీతక్క ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో కొట్లాట జరిగిందని అబద్ధపు వార్తలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే అవి అమ్ముడు కావడం లేదు. బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోంది. ఆ కారణంగా కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదు అని వ్యాఖ్యానించారు. మీ అవినీతికి సజీవ సాక్ష్యం కాలేశ్వరం ప్రాజెక్టేనన్నారు. కేసీఆర్ కూతురు కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు కానీ అవాస్తవాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే ప్రజలే త్వరలో మీకు తగిన బుద్ధి చెబుతారు అని మంత్రి సీతక్క హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




