మానవత్వం చూపిన మంత్రి.. బాలుడికి మ‌రో జ‌న్మ‌

– పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం
– కృతజ్ఞతలు తెలుపుకున్న బాలుడి తండ్రి
– మంత్రి అడ్లూరికి జిల్లావాసుల ప్రశంసలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చూపిన మానవతా సహాయం, మనసున్న నాయకుడిగా అక్కడి ప్రజల హృదయాలను తాకింది. ప్రజల మధ్య ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోంది.. మానవత్వమే అసలైన గొప్పతనం అని. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంపు ఎస్సీ బాలుర వసతి గృహంపై అక్టోబర్‌లో పిడుగు పడిరది. టెర్రస్‌పై ఆరేసిన దుస్తులు తీసుకు రావడానికి వెళ్లిన విద్యార్థి బొల్లె హిమశ్‌ చంద్ర (8వ తరగతి)పై పెద్ద శబ్దంతో పిడుగు పడిరది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి అతని చేతులు, వెన్ను తీవ్రంగా కాలిపోయాయి. వసతి గృహ సిబ్బంది బాలుడిని వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు. పిడుగు ప్రభావంతో భవనం పైకప్పు, గోడలు పగిలి స్లాబ్‌ పెచ్చులూడి మంచాలపై పడగా విద్యార్థులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ స్పందించారు. విద్యార్థి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు ఐదుసార్లు స్వయంగా హాస్పిటల్‌ను సందర్శించి వైద్యుల నుండి వివరాలు తెలుసుకున్నారు. వైద్యం మరింత మెరుగ్గా అందించేలా ఎప్పటికప్పుడు వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ను ఫోన్‌లో సంప్రదించి విద్యార్థికి అత్యుత్తమ వైద్యం అందించండి.. ఎంత ఖర్చయినా సరే.. పిల్లవాడి ప్రాణం ముఖ్యం అని ఆదేశించారు. దీంతో అధికారులు ప్రత్యేక వైద్యం కోసం హిమశ్‌ను యశోదలో చేర్పించారు. వైద్యులు నెల రోజులపాటు చికిత్స అందించి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. ఖర్చు దాదాపు రూ.18 లక్షలు కావడంతో ఆ కుటుంబం అంత మొత్తం భరించలేని స్థితిని తెలుసుకున్న మంత్రి అడ్లూరి మానవతా దృక్పథంతో బాలుడి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదు.. మొత్తం వైద్య ఖర్చును సంక్షేమ శాఖ నిధుల నుండి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎస్సీ డీడీ కమిషనర్‌ క్షితిజ్‌ యశోద హాస్పిటల్‌కు బిల్లు మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

కన్నీటి పర్యంతమైన తండ్రి

హిమశ్‌ చంద్ర స్వగ్రామం మల్యాల మండలంలోని మద్దుట్ల. అతని తండ్రి బొల్లె శ్రీనివాస్‌ గల్ఫ్‌ దేశంలో కూలీగా పనిచేస్తున్నారు. ఘటనకు కేవలం పది రోజుల ముందే ఉపాధి కోసం రూ.1.5 లక్షలు ఏజెంట్‌ ద్వారా చెల్లించి అక్కడికి వెళ్లారు. కొడుకుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే ఇంటికి చేరుకొని మంత్రి అడ్లూరిని కలసి తన కుమారుడి ప్రాణాన్ని కాపాడాలని వేడుకున్నారు. మంత్రి చొరవతో చికిత్స జరిగి కుమారుడు కోలుకున్నాడు. శ్రీనివాస్‌ భావోద్వేగంతో మాట్లాడుతూ నా బిడ్డ ప్రాణం నిలబెట్టింది ప్రభుత్వం. అడ్లూరి లక్ష్మణ్‌ చూపిన దయ, మానవతా గుణం మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు అని అన్నారు. ఈ ఘటనతో జగిత్యాల జిల్లావాసులు మంత్రిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి నాయకుల వల్లే ప్రజల్లో నమ్మకం నిలుస్తుంది. మానవత్వం మిగిలి ఉందని చాటిచెప్పిన సంఘటన ఇది అని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page