ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని ప్రతిన చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ స్ఫూర్తితో చెరువులు కాపాడుకుందాం: మంత్రి సీతక్క
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్10:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రులు, పలువురు నేతలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో వాహనదారులకు పలు సూచనలు చేశారు. సగటున దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని చెప్పారు. తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తు. కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పండగకు ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని ప్రమాణం చేద్దాం. మద్యం తాగి వాహనం నడపరాదు.. ఇది ప్రమాదానికి సూచిక‘ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ ప్రజలందరికీ మంత్రి సీతక్క సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, చెరువులను కాపాడుకుందామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉందని.. చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయన్నారు. పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతామన్నారు. అందుకే అందరమూ చెరువులను కాపాడుకుందామని చెప్పుకొచ్చారు. వర్షాకాలం ముగుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటామని తెలిపారు. చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ అని అన్నారు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించు కుందామన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగని కేటీఆర్ అన్నారు. పూలను, ప్రకృతిని దేవుళ్లుగా కొలుస్తూ ఆడ బిడ్డలు ఆనందంగా జరుపుకునే అద్భుమైన పండుగన్నారు. దేశంలోనే ఎక్కడ లేని అరుదైన, అందమైన సంస్కృతిక వారసత్వం మన బతుకమ్మ పండగ అని గుర్తుచేసుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడ బిడ్డలంతా ఎంతో సంతోషంగా ఈ ఘనమైన పండుగను జరుపుకుంటారన్నారు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ తల్లి మరిన్ని సంతోషాలు, వెలుగు నింపాలని కోరుకుంటున్నాని తెలుపుతూ ఆడబిడ్డలందరికీ కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. ఈరోజుతో బతుకమ్మ సంబురాలు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు ట్యాంక్ బండ్ వద్ద కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరుకానున్నారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.





