రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న ఈ సంతోషకర సందర్భంలో ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలియజేశారు. స్వరాష్ట్రం సాధన కోసం జరిగిన దీర్ఘకాల ఉద్యమం, అమరవీరుల త్యాగాలను, సోనియమ్మ తెగువను ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంకల్పంతో ఏర్పడిన ప్రభుత్వం, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దే ధ్యేయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల బాగోగులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.
స్వల్ప కాలంలోనే అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. గ్రామీణాభివృద్ధికి, మహిళల సాధికారతకు, చిన్నారుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ తరం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలనీ, తెలంగాణను అభివృద్ధి, సమానత, శాంతి, సౌభ్రాతృత్వాల ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.




