- – పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలి
- గుత్తేదార్లకు వెంటనే బిల్లుల చెల్లింపు
- జాతర ముందే 95 శాతం పనులు పూర్తి
- మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పనిచేయడం వల్లే విజయవంతమైందని, మేడారంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి ఆయనతో పాటు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క లకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, తదితరులు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజు దేవతల గద్దెల చుట్టూ రాతి నిర్మాణాన్ని, ఆలయ చుట్టూ ప్రకారం , ప్రధాన ఆర్చిలను, ప్రహరీ సాండ్ స్టోన్ చిత్రాలను, చుట్టూ డ్రైనేజీ, మీడియా టవర్ లను, గద్దెల చుట్టూ ఉన్నా గ్రిల్స్ లను ఆలయ ఫ్లోరింగ్ ను కూలంకషంగా పరిశీలించారు. అనంతరం వాహనం లో జంపన్న వాగు, హరిత,ఊర ట్టం, చిలకల గుట్ట, ఆర్ టి సి జంక్షన్లను పరిశీలించారు.
అనంతరం మంత్రులు మేడారంలోని హరిత హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత జిల్లా అధికారులతో , మేడారం జాతర అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ ప్రాంతంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గుత్తేదారులకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహా జాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరు ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నివాస స్థలాలు ఏర్పాటు చేసి అధికారులు విజయవంతం చేశారని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడం చెప్పుకోదగ్గ విషయమని అధికారులను అభినందించారు. జాతరకు ముందే 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా ఐదు శాతం పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రకారం ఆలయం పునర్నిర్మాణం చేసిందని భవిష్యత్తు తరాలకు 200 సంవత్సరాల వరకు ఎంత మంది భక్తులు వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన వసతులను రోడ్ల విస్తరణ నివాసయోగ్యం ఇతర వసతులు కల్పించామన్నారు. అమ్మవార్ల గద్దెలు, ఆలయ ప్రకారం, ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రపంచం మొత్తం జాతర వైపు చూసిందని గుర్తుచేశారు.
భక్తుల రద్దీ దృష్ట్యా మిగిలిన పనులను త్వరలోనే నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తిస్థాయిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం ప్రాంతంలో ఉన్న రెండు చెరువులను సుందరీకరించాలని వాటికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా చెక్ డాం ల నిర్మాణానికి ప్రణాళికల సిద్ధం చేయాలని, రహదారులకు ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలని అన్నారు. భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి శాశ్వత ప్రతిపాదికన త్రాగునీరు మరుగుదొడ్లు మౌలిక వసతులు కల్పించాలని, జాతర సమయంలో దెబ్బతిన్న చిన్నచిన్న పనులను ఆలయ ఫ్లోరింగ్ డ్రైనేజీ వ్యవస్థ లోపాలను గుర్తించి వాటిని వెంటనే సరి చేయాలని ఆదేశించారు.
మహా జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండే విధంగా గోదావరి నది జలాలను జంపన్న వాగుకు మళ్ళించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం పుణ్య స్నానాలు ఆచరించడానికి రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు నీరు నిల్వ ఉండే విధంగా జంపన్న వాగుపై ఐదు చెక్ డాం ల నిర్మాణాలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, మేడారం ప్రాంతంలో ఉన్న రెండు చెరువులను సుందరీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజులు పాటు జరిగిన మహా జాతరకు 1 కోటి 55 లక్షల మంది భక్తులు హాజరయ్యారన్నారు.
రెండవ మాస్టర్ ప్లాన్ సిద్ధం
అనంతరం మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ జాతర అనంతరం కూడా అధికారులకు మరింత బాధ్యత పెరిగిందని మనసా వాచా కర్మణా మిగిలిన పనులను పూర్తి చేయాలని అన్నారు. మేడారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం ప్రజా ప్రభుత్వం రెండవ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా మేడారం ప్రాంతంలోని రెండు చెరువులను అభివృద్ధి చేయడం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, మీడియా భవన్ వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. జాతర విజయవంతంలో అధికారులు చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఎన్ సి మోహన్ నాయక్ , జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మునిసిపాలిటీ చైర్మెన్ చింతనిప్పుల చంద్రకళ, ఈ ఓ వీరస్వామి, పూజారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





