మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్‌టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యంతో తయారుచేసిన వంటకాలను ఆయన రుచి చూశారు. మంత్రి తన ఇంట్లో భోజనానికి రావడంతో ఆ కుటుంబంతోపాటు ఆ గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రికి సన్న బియ్యంతో పాటు పాయసం, పులిహోర, సేంద్రియ ఎరువులతో పండించిన తోటకూర పప్పు, గోంగూర పచ్చడి, ఇతర ఆహార పదార్థాలను వడ్డించారు. మంత్రి పొంగులేటి సంతోషంగా భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ వలన ప్రజల నుంచి మంచి స్పందన వొస్తుందని, చరిత్రరాత్మకమైన ఘట్టంలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. 80 శాతానికి పైచిలుకు బడుగు బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. అనంతరం వంక శివలక్ష్మి తన భర్త చనిపోయాడని కుటుంబ పోషణకు కూలీ పనులు చేసుకుంటున్నానని మంత్రి దృష్టికి తీసుకురాగా, వారి కుటుంబం సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్,సిబ్బంది పాల్గొన్నారు.





