ఇది చేత‌ల ప్ర‌భుత్వం

– ఇందిరా మహిళా శక్తి  ఆత్మవిశ్వాసానికి నిదర్శనం
– రూ 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ
– ఇందిరమ్మ పాలనలో  పేద ప్రజలకు భరోసా
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


కొత్తగూడెం/ ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి  సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్‌, ఎస్పీ రోహిత్‌ ‌రాజు, ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపే ప్రభుత్వమ‌న్నారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి’ అనే ఆలోచన కేవలం హామీ కాదని, కార్యరూపం దాలుస్తోందని స్పష్టం చేశారు. ప్రజా  ప్రభుత్వం తొలి 24 గంటల్లోనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించిందన్నారు. నెలకు సగటున ప్రతి మహిళ రూ 2500 నుండి 4000 ఆదా చేసుకునే స్థితి ఏర్పడిందని వెల్లడించారు.  రూ 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌, ఆరోగ్యశ్రీ ద్వారా రూ10 లక్షల వరకు మెరుగైన వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 5 ‌లక్షల గృహనిర్మాణ సహాయం వంటి పథకాలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి, అని మంత్రి తెలిపారు.  రైతుల పట్ల ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని, రైతుబంధు, పంట పెట్టుబడి సాయం, రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, 9 రోజుల్లో రూ 9 వేల కోట్ల నిధుల జమ వంటి చర్యల ద్వారా రైతుల ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు. నూతనంగా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు త్వరలోనే మరో 40 వేల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది అర్హులకు రూ 5 లక్షల మంజూరు చేశామని, కేవలం ఇల్లందు నియోజకవర్గానికే రూ.240 కోట్లు కేటాయించామన్నారు.  ప్రతి సోమవారం ఫౌండేషన్‌ ‌నుండి గృహ ప్రవేశం వరకు ప్రభుత్వం నిఖార్సైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి సమాజ అభివృద్ధికి నిజమైన బలమని పేర్కొన్నారు. ఈ సృష్టికి మూలం అమ్మ. మహిళ లేకుండా ఒక్క ఇల్లు సుఖంగా ఉండదు, ఒక్క ఊరు ఆనందంగా ఉండదు. అందుకే మహిళను గౌరవించాలి, నిలబెట్టాలి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అని అన్నారు.  ఒకప్పుడు బట్టలు కొనేందుకు వడ్డీకి డబ్బులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర మహిళలు నేడు స్వయం ఉపాధిలో రూ 20 నుంచి రూ 30 వేల వరకూ సంపాదిస్తున్న స్థితి వచ్చిందన్నారు. ఇది ఒక పెద్ద మార్పని అన్నారు.సమాజంలో మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తేనే ఆమెను నిజమైన స్వతంత్ర భారత నాగరికురాలిగా పరిగణించవచ్చని సీతక్క  వ్యాఖ్యానించారు. మహిళలకు చెందిన సంఘాలు ఈ మార్పుకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయని, వాటిని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సభ్యురాలిగా ఉన్న మహిళ మరణించిన సందర్భంలో, ఆమె కుటుంబంపై భారం పడకుండా లోన్‌ ‌బీమా ద్వారా రుణాన్ని మాఫీ చేసేలా ఏర్పాటు చేయడం వల్ల వేల కుటుంబాలకు భరోసా కలుగుతోంది అని ఆమె వివరించారు.ప్రతి మహిళా సంఘం ఒక అక్కలా, ఒక అమ్మలా ఉండాలి అని, ఒంటరి మహిళలకు అండగా మహిళా సంఘాలు ఉండాలన్నారు. భద్రాచలం మహిళలు తయారుచేసిన రాగిలడ్డు ప్రధానమంత్రికి నచ్చడం, ఆయన పొగడడం రాష్ట్రానికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్‌ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల చేనేత చీరలు దుబాయ్‌ ‌నుంచి కాదు, బొంబాయ్‌ ‌నుంచి కాదు , మన సొంత మహిళలు చేతి ప‌నితో నేసినవి.  పంపిణీ కార్యక్రమాలు త్వరలోనే చేపడతామన్నారు.ప్రతి మహిళ ఆత్మాభిమానంతో బతకాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి  కల అని, ఇదే ప్రజా ప్రభుత్వం సంకల్పం అన్నారు.   ముందుగా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారం, కామేపల్లి,  గార్ల మండలాల పరిధిలోని మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు,  ప్రభుత్వం మహిళల ఉన్నతికి ఇస్తున్న ప్రోత్సాహకాలను గురించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ‌విద్యా చందన వివరించారు.ఈ కార్యక్రమంలో  కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌ ‌డి వేణుగోపాల్‌, ‌మహబూబాబాద్‌ ‌డి ఆర్‌ ‌డి ఓ పప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌ ‌రాజు, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లందు తాసిల్దార్‌ ‌రవికుమార్‌, ఇల్లందు మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీకాంత్‌, ఇల్లందు ఎంపీడీవో ధన్‌ ‌సింగ్‌  ‌డిఎస్‌ఓ ‌రుక్మిణి, డిస్టిక్‌ ‌వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ‌స్వర్ణలత లేనినా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *