పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి
– 8 నుంచి ఇంటర్‌ వరకు చదివే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ
-రూ.5.50 కోట్లతో జూనియర్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఖమ్మం/కూసుమంచి, ప్రజాతంత్ర, జూలై 31 : ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బడి పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి మంత్రి పొంగులేటి గురువారం కూసుమంచిలో పర్యటించి రూ.5.50 కోట్లతో నిర్మించనున్న జూనియర్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేవారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిళ్ల పంపిణీ, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూసుమంచి మండలంలో డిసెంబర్‌ వరకు కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని, పాలేరు నియోజకవర్గంలో 8 నుంచి 10వ తరగతి చదివే ఆడ పిల్లలకు గత ఏడాది సైకిళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం 8వ తరగతికి వొచ్చిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, యేటా 8 నుంచి ఇంటర్‌ వరకు చదివే బాలికలకు సైకిళ్లు అందిస్తానని తెలిపారు. విద్యారంగంలో కాస్త వెనుకబడి ఉన్న నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గత 20 నెలల కాలంలో రూ.470 కోట్లను విద్యా రంగంలో పాలేరు నియోజకవర్గానికి మంజూరు చేశామన్నారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా సమీకృత గురుకులం, రూ.208 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, రూ.46 కోట్లతో ఐటీఐ, రూ.5.5 కోట్లతో జూనియర్‌ కళాశాల, రూ.2.70 కోట్లతో తిరుమలాయపాలెం హాస్టల్‌ మంజూరు చేశామని వివరించారు. గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో 40 శాతం డైట్‌ చార్జీలు, 200 శాతం కాస్మెటిక్‌ చార్జీలను పెంచామని, హైదరాబాద్‌ సమీపంలో అభివృద్ధి చేస్తున్న ఫోర్త్‌ సిటీలో పిల్లలకు స్కిల్‌ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో ముగ్గురు కంప్యూటర్‌ శిక్షకులను నియమించేందుకు రూ.3 లక్షలను మంత్రి మంజూరు చేశారు. పాఠశాల ప్రహరీతోపాటు ాఠశాలకు ఆదాయం వొచ్చేలా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తున్నదని, ఇందులో భాగంగా జూనియర్‌ కళాశాలను ఐదు నెలల కాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారని తెలిపారు. డిసెంబర్‌ చివరి నాటికి పాఠశాల ఎదురుగా జూనియర్‌ కళాశాలను సిద్దం చేస్తామన్నారు. పీఎంశ్రీ కింద ఈ పాఠశాలను ఎంపిక చేసి ల్యాబ్‌, ఏఐ టూల్స్‌ ద్వారా విద్యా బోధన వంటి అనేక సౌకర్యాలను కల్పించామని, పిల్లలు ఈ సదుపాయాలను వినియోగించుకుంటూ బాగా చదువు కోవాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్‌, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, కూసుమంచి తహసీల్దార్‌ రవికుమార్‌, మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *