` కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
` మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి, ప్రజాతంత్ర, జూలై 30: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్టి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులతో కలిసి నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను కలెక్టర్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కష్టాలు చూసిన ప్రభుత్వం వారికి భరోసా కల్పించే విధంగా పాలన కొనసాగిస్తున్నదని, ప్రతి రోజు పేదల ముఖంలో చిరునవ్వు ఉండేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా మహిళల పేరిట అమలు చేస్తున్నదని చెప్పారు. గత నాలుగు నెలల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం సున్నా వడ్డీ కింద రూ.855 కోట్లు విడుదల చేయగా ప్రతి నియోజకవర్గంలో మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తూ సున్నా వడ్డీ సొమ్ము చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బంక్, రైస్ మిల్లు వంటి వ్యాపారాలలో అవకాశం కల్పిస్తున్నామని, రైతులు పండిరచే ధాన్యం కొనుగోలు బాధ్యతలు కూడా మహిళా సంఘాలకు అప్పగించామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామని మంత్రి తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నదని, ప్రస్తుతం రేషన్ కార్డులలో 62 వేల కొత్త సభ్యులను నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డుతో బియ్యం మాత్రమే కాకుండా ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతాయని చెప్పారు. ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతి పథకాన్ని మహిళల పేరిట అమలు చేస్తున్నదని, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలతో పేద కుటుంబాలు బాగుపడుతున్నాయని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలవుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ట్రస్టు ద్వారా మంత్రి సైకిళ్లను పంపిణీ చేశారని తెలిపారు. అనంతరం మంత్రి పొంగులేటి పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు మాదారంలో రూ.88.5 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, బోదులబండలో 15 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, మండ్రాజుపల్లి గ్రామంలో మండ్రాజుపల్లి నుండి కోరట్లగూడెం వరకు 2 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎర్రయ్య, మార్కెట్ కమిటి చైర్మన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.పరంజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.





