– మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో మార్పు కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 59, 60 డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్ హాల్‌లో 1వ, 59వ, 60వ డివిజన్లకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ మూడు డివిజన్ల పరిధిలో 150మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించామని, విడతలవారీగా లబ్ధిదారులకు రూ.5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఏ ఆడబిడ్డా ఇల్లు రాలేదని బాధపడొద్దని, రాబోయే మూడు విడతల్లో మిగిలిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక ఈ మూడు డివిజన్ల పరిధిలో రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ.23 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడిరచారు. గత పదేళ్లలో ఆనాటి ప్రభుత్వం చేయనిది మన ఇందిరమ్మ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, టీపీసీసీ మహిళా కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



