– న్యాక్ ట్రైనర్‌కు జాతీయ అవార్డు
– మంత్రి కోమటి రెడ్డి హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్‌ఏసీ)ను అత్యుత్తమ స్కిల్ డెవలప్‌మెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా జిల్లాల్లో న్యాక్ ద్వారా శిక్షణ ఇవ్వడమే కాక వంద శాతం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎన్‌ఏసీ వైస్ చైర్మన్, మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మంత్రి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే టీచర్స్ డేను పురస్కరించుకొని న్యాక్ ట్రైనర్ స్నేహలతకు జాతీయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలో జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న స్నేహలతకు ఫోన్ చేసి మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. ఆమె న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని కొనియాడారు. దేశవ్యాప్తంగా 13మంది ఎంపికైతే తెలంగాణ నుండి హన్మకొండకు చెందిన నక్క స్నేహలత ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వ కారణమన్నారు. నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా ఎన్‌ఏసీను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్న మంత్రి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడం న్యాక్ ఫ్యాకల్టీ, సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీని మంత్రి అభినందించారు. స్నేహలతకు న్యాక్ డైరెక్టర్ జనరల్(డీజీ), ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





