– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, జులై 31: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, నెల రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూంలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. కేరళలో 99.9 శాతం అక్షరాస్యత ఉండగా మన రాష్ట్రంలో 60 శాతం ఉందని, విద్య, నైపుణ్యాలు పెంపొందింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతోపాటు అన్ని రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నదని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడిరచారు. ఈ నెల 4న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో భవనాలు నిర్మించామని, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఎల్‌ఎల్‌ఎం, ఎంఫార్మసీ, కోర్సులు, భవనాలు మంజూరు చేశారని, 2026-27లో అడ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నాయని, లా, ఫార్మసీకి మంచి డిమాండ్ ఉందని అన్నారు. మంచి విద్యనందించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్సు చాలా ఉత్తమమైనదని, వైద్యరంగంలో నర్సింగ్ అనేది మొదటి అదుగు అని అన్నారు. రోగి ప్రాణాలు కాపాడటంలో వాళ్ల పాత్ర ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో మెడికల్ టూరిజంలో అనేక ఉద్యోగావకాశాలున్నాయని, ప్రస్తుతం నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనంలో స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన హాస్పిటల్‌లో సౌకర్యాలు సమకూరుస్తాం
నల్గొండ ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించి సమర్పించాల్సిందిగా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లో అభివృద్ధిపరిచిన డయాలసిస్ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి డయాలసిస్ కేంద్రానికి వచ్చిన నూతన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి చాంబర్‌లో వైద్యులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో పోస్టుల భర్తీతోపాటు, ఎన్‌ఐసి, పిఐసి, ఆర్థోపెడిక్ తదితర అన్ని విభాగాలలో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, అలాగే బ్లడ్ బ్యాంక్‌కు అవసరమైన రిఫ్రిజిరేటర్, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లికి, బిడ్డకు పనికొచ్చేలా ఎంసిహెచ్ కిట్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఫిజీషియన్, సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్‌వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహోచ్‌వో వేణుగోపాల్ రెడ్డి, హాస్పిటల్ వైద్యులు, తదితరులు హాజరయ్యారు.



