- కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సహాయం
- ఒకరోజు పింఛను మొత్తం రూ.2.80లక్షలు అందజేత
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ. 2.80 లక్షల చెక్కును ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న ఒక సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు తమ పెద్ద మనసుతో అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. అంకితభావంతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని గుర్తుచేశారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని, వారికి అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద రెడ్డి, ప్రతినిధులు విష్ణు స్వరూప్ రెడ్డి, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సౌమ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ శాఖలో భారీ బదిలీలు
ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనుందని మంత్రి జూపల్లి వెల్లడించారు. వారం రోజుల్లోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని, అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను దశలవారీగా చేపడతామని వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతి చెందడం పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారని తెలిపారు.తెలంగాణను దేశీ, విదేశీ పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతన పర్యాటక విధానం ద్వారా వాటర్ స్పోర్ట్స్, ఎకో, వెల్నెస్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రహదారుల వెంట పర్యాటకులకు సమాచారం అందించే సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.




