నిరుద్యోగులారా.. నిరాశ వద్దు

– రాష్ట్రం ఇవ్వకపోయినా మోదీ ప్రభుత్వం ఉద్యోగాలిస్తోంది
– యువతను సొంత కాళ్లపై నిలబడేలా చేస్తోంది
– కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హకీంపేటలోని సీఐఎస్‌ఎఫ్ నిసా అంతరిక్ష ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన 18వ రోజ్ గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 61మందికి నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, కేంద్రం నిర్వహిస్తున్న ఉద్యోగాల భర్తీకి ఉన్న తేడాను గమనించాలని యువతను కోరారు. టీజీపీఎస్సీ అంటేనే లీకేజీలు, పైరవీలు, కోర్టు కేసులు, ఆందోళనలు, ధర్నాలతో ఏళ్లతరబడి సాగుతున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం ఒక్క పైరవీకి, అవినీతికి, లీకేజీలకు ఆస్కారం లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది అని ఆయ‌న‌చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసినా చేయకపోయినా నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడి పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి తీసుకొస్తున్నారని చెప్పారు. గత మూడేళ్లలో 11 లక్షల ఉద్యోగాల భర్తీ చేశారన్నారు. నేడు 61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం గొప్ప విషయమని అన్నారు. నిరుద్యోగుల బాధలు ప్రధానికి తెలుసు.. అందుకే నిరంతరం రోజ్‌గార్ మేళా పేరిట కేంద్ర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులారా.. మీ పనితీరుతో మీ శాఖలకు వన్నె తెండి అని ఉద్బోధించారు. నిరుద్యోగులారా.. నిరాశపడకండి.. ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి రావాలని మోదీ కోరుకుంటున్నారు అని సంజయ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐఎసఎఫ్ నిసా ఐజీ డీపీ పరిహార్, డీఐజీ అనిల్ డామోర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *