హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ సంస్థల మంత్రిగా సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. కాగా, గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యుడిగా నామినేట్ అయ్యారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆయన చేరడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుత మంత్రివర్గంలో అజారుద్దీన్ ఏకైక ముస్లిం ప్రతినిధి. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఉప ఎన్నికకు ముందు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమని పరిశీలకులు భావిస్తున్నారు. అజారుద్దీన్ చేరికతో రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య 16కి చేరుకుంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు మంత్రులు, నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.





