– అత్యవసర సాయం కింద రూ.లక్ష చెక్కు అందజేత
– బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
– బాలుడికి పెన్షన్, స్పెషల్ పాఠశాలలో ప్రవేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: ఎల్బీనగర్ మన్సురాబాద్ సమీపంలోని శివగంగ కాలనీలో ప్రేమ్‌చంద్ అనే మూగ బాలుడిపై కుక్కల దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి వెంటనే తనకు ఫోన్ చేసి ప్రేమ్‌చంద్‌కు తగిన వైద్య సదుపాయం, ఆర్థిక సహాయంతోపాటు కుటుంబానికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు. ఈ మేరకు నిలోఫర్ హాస్పిటల్‌కు గురువారం వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించానన్నారు. ప్రేమచంద్ తల్లి దండ్రులు తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు మంత్రి రూ.లక్ష చెక్కును అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. బాలుడికి స్పెషల్ స్కూల్‌లో ప్రవేశం ఇప్పించి చదువును కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ చేరుకుని బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించారన్నారు. బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు బాలుడికి సంబంధిత శాఖ అధికారులు దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారు. అలాగే అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేసి అతను కోలుకున్న తర్వాత అతని సంరక్షణకు కావలసిన సదుపాయాలు పూర్తిగా కల్పించనున్నారు. దీంతోపాటు వైద్య చికిత్స, పునరావాస సహాయ అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ చోటుచేసుకున్నా జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను పరామర్శించి అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, నిలోఫర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ ఆనంద్, లాలూప్రసాద్, బాబురావు తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



