మిష‌న్ ప్ర‌కృతిపై అవ‌గాహ‌నా ఒప్పందం

– సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఫైన్ ర‌కం బియ్యం
– స్టీల్ పాత్ర‌ల‌నే ఉప‌యోగించాలి
– విద్యార్థుల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి
– సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23:  మిష‌న్ ప్ర‌కృతిపై బుధ‌వారం డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా- టీజీఎస్‌డ‌బ్ల్యుఆర్ ఈఎస్ ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌నా ఒప్పందం కుదిరింది.  డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ నిర్వాహ‌కులు అనిల్ కుమార్ శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ ఒప్పందంపై సంత‌కాలు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారి రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పని చేస్తున్న జోనల్‌ అధికారులు, ప్రిన్సిపాల్స్ తో ఒరియంటేషన్ కార్యక్రమాన్ని ఎంసీహెచ్ ఆర్డి  హైదరాబాద్‌ వేదికగా బుధవారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్థ  అనేక వినూత్న కార్యక్రమాలను చేప‌డుత‌న్న‌దంటూ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసి, నాణ్యమైన , ఫైన్ రకం  బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  వసతి గృహాల్లో ఇక నుండి అల్యూమినియం పాత్రలకు బదులు  స్టీల్ పాత్రలలో వండాల‌ని  ఆదేశించారు.  ఇందుకు అయ్యే  ఖర్చుల అంచనా నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సమస్యలను న్యాయపరంగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి స్పష్టం చేశారు. ప్రిన్సిపాళ్లకు  సర్వీస్ స‌మ‌స్య‌ల‌ను నియమావళి మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గతంలో విద్యార్థులు డార్మెటరీల్లోనే పాఠాలు విని, అక్కడే తిన్న ఘటనలు విన్నప్పుడు ఎంతో బాధ కలిగింది. ఇకపై హాస్టళ్లను స్వయంగా పర్యటిస్తా.. సమస్యలు నేరుగా తెలుసుకుంటాన” ని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాకు ఇప్పటికే సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రతి హాస్టల్‌కు 15 రోజులకొకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య బృందం వచ్చి విద్యార్థులకు  ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. తాను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఈ గురుకులాల్లోనే చదువుకున్న విద్యార్థినే. బాధ్యతలు తెలిసినవాడిని అని చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని మంత్రి  దిశ నిర్దేశం చేశారు. విద్యార్థుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్ట్ వారీగా వెనుకబడ్డ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జోనల్ అధికారులకు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. డైనింగ్ హాల్స్‌, మెస్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిధుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పరకాల డిగ్రీ కళాశాల తాత్కాలిక మరమ్మత్తకు అవసరమైన నిధులను ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి ఆ  కలెక్టర్‌తో  సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన అక్కడికక్కడే హామీ ఇచ్చారు.  గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డైట్ చార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించలేదని తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెస్ , కాస్మెటిక్ చార్జిలను పెంచిన విషయాన్ని  గుర్తు చేశారు. వచ్చే  విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం, షూస్‌, పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  పిల్లలకు  అందించే మెస్ విషయంలో అందులో జరిగే చిన్నపాటి లోటుపాట్లపై ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో బురద జల్లినా, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.  కార్యక్రమంలో టీజీఎస్‌డ‌బ్ల్యుఆర్ ఈఎస్‌   కార్యదర్శి డా. వి.ఎస్. అలగు వర్షిణి, ఐఏఎస్‌ మాట్లాడుతూ, ఇంతవరకు గురుకులలో చేపట్టిన విభిన్న  వినూత్నమైన  కార్యక్రమాలను ఆమె క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా  సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పూర్తిగా అండదండలు అందిస్తారని చెప్పిన మంత్రికి  ఆమె  కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *