– అసెంబ్లీ, మండలిలో బిఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షస్
– సభా సంఘం లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు ..
– మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చ్ 30: మైనింగ్ విషయం రెండు రోజులుగా ఉభయ సభల్లో గొడవకు దారితీసింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. దానిపై న్యాయ విచారణకు బిఆర్‌ఎస్ డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. పలుమార్లు స్పీకర్ వారించినా బిఆర్‌ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో రెండు రోజులపాటు వారిని ఆదివారం సస్పెండ్ చేశారు. మండలిలోకూడా అదే సీన్ రిపీట్ కావడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 11 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్సీలను సోమవారం ఒక రోజు సస్పెండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా చెప్పబడుతున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందన్నది ఈ మొత్తం ఎపిసోడ్‌కు నాంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతులు లేకుండా మైనింగ్‌కు పాల్పడుతున్నదని, దీనిపై అధికారులు అడ్డుచెప్పినా మైనింగ్ మాత్రం ఆగటంలేదంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు అసెంబ్లీలో చర్చకు తెరదీయగా దీనిపైన రెండు రోజులుగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అధికారులు ఆ సంస్థకు ఇచ్చిన నోటీసులతోపాటు పలు ఆధారాలను హరీష్‌రావు సభముందుంచారు. ఇప్పటికే రెండుసార్లు అధికారుల దాడుల్లో ఇల్లీగల్ అని తేలినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దీనిపై హౌస్ కమిటి వేయాలని డిమాండ్ చేశారు. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో హౌస్ కమిటీ వేయాల్సిందేనని బిఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ చప్పట్లు కొడుతూ నినాదాలతో స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, స్పీకర్ పలుమార్లు కోరినా వారు తమ స్థానాల్లో కూర్చోకపోవడం ఒకటికాగా బిఆర్‌ఎస్ హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ మరింత గందరగోళానికి దారితీసింది. బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరాడన్న ఆరోపణలను ఎదుర్కుంటున్న స్టేషన్‌ఘనపూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. దీంతో మైనింగ్ వివాదం కాస్తా దళితులను చిన్నచూపు చూస్తున్నారన్న వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విచారణకు నువ్వు సిద్దమా అంటే నువ్వు సిద్దమా అన్న చాలెంజీలు చేసుకునేవరకు వెళ్ళింది. కాగా, రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై సిబిసిఐడి విచారణ చేపడతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. దీంతో హౌస్ కమిటీ, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాల్సిందేనంటూ బిఆర్‌ఎస్ శాసనసభ్యులు పట్టుబట్టగా సభా కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తున్నారంటూ వారిని రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు.
శాసనమండలిలో సభ్యుల సస్పెన్షన్ తొలిసారి
శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్క రోజు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ అవినీతి, అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సెషన్ ముగిసేవరకూ సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరించింది. దీంతో పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం మండలి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, సస్పెన్షన్‌కు నిరసగా వారు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో సీఎం రేవంత్ స్పష్టం చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. మరోవైపు ఛైర్మన్ సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని పదేపదే కోరారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఒక రోజుకు ఆ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఈ క్రమంలో మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు.
పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన మంత్రి పొంగులేటి అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ మైనింగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటిపై మధుసూదనాచారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గన్‌పార్క్ వద్ద మీ యాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో హరీష్ రావు బయటపెట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వం దుర్మార్గ వైఖరితో బీఆర్‌ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం కూడా ఈ అక్రమాల్లో భాగస్వామ్యంగా ఉన్నారని ఆరోపించారు. పొంగులేటిని తక్షణమే బర్తరఫ్ చేయాలని మండలిలో డిమాండ్ చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నామని పదేపదే చెబుతోందని.. కానీ ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమాలు జరిగాయని చెప్పడంతో నాగం జనార్ధన్ రెడ్డితో సభా సంఘం వేశారని గుర్తు చేశారు. అదేవిధంగా పొంగులేటి అక్రమాలపై కూడా సభా సంఘం వేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఉదయం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ మండలి సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాణి దేవి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, తక్కిలపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



