– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
న్యూదిల్లీ, ఆగస్టు 12: మైనింగ్ రంగం (mining section) ద్వారా ఉపాధి కల్పన పెరిగేందుకు, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోదీ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishanreddy) తెలిపారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్, రెగ్యులేషన్ యాక్ట్(ఎంఎండీఆర్)కు ప్రతిపాదించిన సవరణలకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 2014కు ముందు దేశంలో మైనింగ్ రంగం పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసునని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మోదీ ఈ రంగంలో సమూల సంస్కరణలకు ప్రోత్సహించారని అన్నారు. ఈ చట్టానికి 2015, 2021, 2023లో సవరణలు తీసుకొచ్చామని, ఇవాళ మరో ఆరు సవరణలు తీసుకొచ్చి సభ ముందు ప్రతిపాదనలు పెట్టామని, ఇపుడు సంపూర్ణ పారదర్శకతతో వేలం ద్వారా గనుల కేటాయింపు జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ మినరల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ మిషన్‌ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో చట్టంలో సవరణలు ప్రవేశపెట్టామన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో క్రిటికల్ మినరల్స్ పాత్ర కీలకమని, ఈ మినరల్స్ కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్నామని చెప్పారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన కారణంగా మనం కూడా క్రిటికల్ మినరల్ సప్లయ్ చైన్ రంగంలో పురోగతి సాధిస్తున్నామన్నారు. సోలార్ ప్యానెల్స్ నుంచి విండ్ టర్బయిన్స్ వరకు, వ్యవసాయం నుంచి వైద్య పరికరాల వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వరకు, సెల్ ఫోన్ నుంచి విమానాల వరకు, డిఫెన్స్ నుంచి స్పోర్ట్స్ వరకు ప్రతి రంగంలో క్రిటికల్ మినరల్ పాత్ర కీలకమన్నారు. మోదీ ఏ దేశానికి వెళ్లినా ఆ దేశాధినేతలతో క్రిటికల్ మినరల్స్‌పై చర్చిస్తున్నారని, కబిల్ పీఎస్‌యూ ద్వారా విదేశాల్లోని క్రిటికల్ మినరల్‌ను భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ లిథియం కోసం జాంబియా, అర్జెంటినా వంటి వేర్వేరు దేశాలకు వెళ్తున్నాం.. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక మైనింగ్ ప్రాంతాల అభ్యున్నతి కోసం డీఎంఎఫ్‌ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా ఉపాధి కల్పన, ప్రజాసంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మోదీ నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజాసంక్షేమానికి డీఎంఎఫ్ ద్వారా బాటలు వేస్తున్నామని, ఎన్‌ఎంఈటీ ద్వారా ఎక్స్‌ప్లొరేషన్‌కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నామని వివరించారు. ఇవాళ విపక్షాలు ఈ సవరణలకు మద్దతుగా నిలుస్తాయనుకుంటే ఎప్పటిలాగే అభివృద్ధికి ఎలాంటి అవి మద్దతు ఇవ్వలేదన్నారు. కొందరు నాయకులకు ఈ దేశంలో మైనింగ్ రంగంపై నమ్మకం లేదు.. దేశ సైన్యంపై నమ్మకం లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేదు.. అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం లేదు.. పార్లమెంటుపై నమ్మకం లేదు.. ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు.. దేశంలోని మీడియాపై నమ్మకం లేదు.. అందుకే ఇలా దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అడ్డంకులను సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు..





