~రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ , బోర్డు సభ్యుడు నరసింహారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది . తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్‌ను గత ఏడాది మార్చిలో ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో 12 మంది సభ్యులను నియమించింది. ఐఎన్‌టీయూసీ నుంచి ఎస్.నరసింహారెడ్డి సభ్యుడిగా ఎంపికయ్యారు. జనక్‌ప్రసాద్, నరసింహారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ట్రేడ్ యూనియన్ కార్యకర్త గంజి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. మార్చిలో జారీ చేసిన జీవో నం.443, డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నం.21లను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ శామ్‌కోషి ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ కనీస వేతన చట్టం 1948లోని సెక్షన్ 8(2), 9ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను పూర్తిగా ఉల్లంఘించి ప్రభుత్వం చైర్మన్, సభ్యుడి నియామకం చేపట్టిందన్నారు. రాష్ట్ర వేతన సలహా బోర్డుకు చైర్మగా లేదా సభ్యులుగా నియమించే వ్యక్తి స్వతంత్ర సభ్యుడిగా ఉండాలని, మరే ఇతర పదవిని కలిగి ఉండకూడదన్నారు. బోర్డు చైర్మన్‌గా నియమితులైన జనక్ ప్రసాద్ ఐఎన్‌టీయూసీకి అనుబంధ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో అధికార పార్టీ అయిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధిగా కూడా ఉన్నారన్నారు. నరసింహారెడ్డి.. ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2016లో రెండు సలహా బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చట్టప్రకారం కనీస వేతనాలను పెంచే నిర్ణయం తీసుకోలేదని నివేదించారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని ప్రభాకర్ వాదనలు వినిపించారు.



