– అది ఆర్‌బిఐ పరిధిలో లేదన్న గవర్నర్ మల్హోత్రా
గాంధీనగర్, ఆగస్ట్ 11: బ్యాంకు ఖాతాదారుల అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన అన్నది ఆయా బ్యాంకులకున్న స్వేచ్ఛ అని, ఇందులో తమ జోక్యం ఉండదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 వేలకు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గుజరాత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విూడియాతో మాట్లాడారు. కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్‌బీఐ బ్యాంకులకే వదిలేసిందన్నారు. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి.. మరికొన్ని రూ.2 వేలు చేస్తాయి.. ఇంకొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయని, ఈ అంశం ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి రాదని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తుండగా ఐసీఐసీఐ మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదార్లకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌లో కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచేసింది. ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే ఇది వర్తించనుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు కనీసం రూ.50వేల నిల్వ ఉంచాలి. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. ఇప్పుడు ఏకంగా 5 రెట్లు పెంచేసింది. సెవిూ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తాన్ని రూ.5,000 నుంచి రూ.25వేలకు, గ్రావిూణ ఖాతాదార్లకు రూ.2,500 నుంచి రూ.10వేలకు సవరించింది. కనీస నిల్వ లేనిపక్షంలో చార్జీలు కనీస నిల్వకు ఎంత తక్కువ మొత్తం ఉంటుందో దానిపై 6 శాతం లేదా రూ.500 ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడిరచింది.





