– పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైనది
– పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానం
– ‘జీటో కనెక్ట్ 2025’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా ఉన్న తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్‌ఐసీసీలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న జీటో కనెక్ట్ 2025 కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారని, అయితే మారుతున్న పరిస్థితులకనుగుణంగా వారి ఆలోచన తీరు కూడా మారిందని అన్నారు. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటన్నారన్నారు. ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమైనదా అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందన్నారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. జైన సమాజం సేవా స్ఫూర్తిని తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాదిమంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





