– లయోలా అకాడమీ మిల్లెట్ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అల్వాల్‌లోని లయోలా అకాడమీలో నిర్వహించిన మిల్లెట్ ఫెస్టివల్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారు తయారు చేసిన మిల్లెట్ వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మిల్లెట్లు అధిక పోషక విలువలతో ఆకలి తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయని చెప్పారు. ఒకప్పుడు అనాగరిక, ఆటవిక ఆహారంగా పరిగణించిన మిల్లెట్లు నేడు స్టార్ హోటల్స్‌లో లభించడం గర్వకారణమని అన్నారు. ఈ తరం మిల్లెట్ ఆహారాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తాను మిల్లెట్ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు రాలేదని, రాజకీయ ఒత్తిడుల వల్లే బీపీ, షుగర్ సమస్యలు వచ్చాయంటూ వాటి కోసం తప్ప దేనికీ మందులు వాడడంలేదని తెలిపారు. ఆదివాసీ సమాజం సహజ సిద్ధమైన ఆహారం, సొంత జ్ఞానంతోనే బతుకుతున్నదని, తాను ఎప్పుడూ శారీరక శ్రమకు వెనకాడనందువల్లే కరోనా సమయంలో వంద రోజులు రోగులకు సేవలు చేసినా తనకు ఏ సమస్యా రాలేదని ఆమె గుర్తు చేశారు. విద్య ద్వారానే గౌరవం లభిస్తుందని, వివక్ష లేకుండా అన్ని రంగాల్లో అమ్మాయిలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.మనుషులు శాశ్వతం కాదు, మనం చేసే మంచి పనులే శాశ్వతం కాబట్టి శ్రమను, ఎదుటివారిని గౌరవించాలి అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యాసంస్థలు, విద్యార్థులు ఆదివాసీ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై సమాజాన్ని అధ్యయనం చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





