మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ఇందిరా మహిళా శక్తి సంబరాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబరాలను ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. మంత్రుల బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించి వడ్డీ మాఫీ చెక్కులను, ప్రమాద బీమా, లోన్‌ బీమా చెక్కుల పంపిణీతో పాటు, మహిళా సంఘాల నూతన వ్యాపారాలను, మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సులను పంపిణీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కొల్లాపూర్‌ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌ రెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి ములుగు, ఇల్లందు, భూపాలపల్లి సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈనెల 21న అచ్చంపేటలో జరిగే ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. పలు నియోజకవర్గాల్లో జరిగిన సంబరాలు బతుకమ్మ వేడుకలను తలపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *