– ఉపాధి హామీ మండలి సమావేశం ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: గామీణ పేదల జీవనోపాధికి ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలు విధానం, కల్పించిన పని దినాలు, చేపట్టిన పనులు, సృష్టించిన సామాజిక ఆస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించారు. మ్రండలి సభ్యులు పథకం అమలులో మెరుగుదలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదిస్తున్న “విబిజీ రాంజీ” విధానం అమల్లోకి వస్తే కూలీలు నష్టపోయే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి హక్కుగా లభించే ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక ఆస్తుల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డాక్టర్ సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ దివ్య దేవరాజన్‌తో పాటు మండలి సభ్యులు గుమ్మడి సొమయ్య, బీరెడ్డి భగవాన్ రెడ్డి, ఎన్. ప్రతాప్ రెడ్డి, సిద్ధరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, గండీడ్ నరసింహులు గౌడ్, ధండు రమేష్, చల్లా నారాయణ రెడ్డి, మండరాపురం నాగేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు నాణ్యమైన నీరందించడమే లక్ష్యం
గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంగళవారం నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో ఆమె అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సమీక్షలో భాగంగా మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని వివరించారు. అయితే మంత్రి ప్రతి ఎస్ ఈ పరిధిలో ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదని, ఇటీవల కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయడం సవాలుగా ఉన్నచోట్ల స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని మంత్రి ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, సరఫరా జరిగిందని వారి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి సూచించారు. “అప్పుడే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు. గతంలో మాదిరి వాస్తవాలను దాచిపెట్టి 100 శాతం నల్లా నీటి సరఫరా జరుగుతోందని నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను నిజాయతీగా తెలియజేసి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రజల అవసరాలు తీర్చుతోందని చెప్పారు. ఈ రంగానికి తగిన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని, ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై నమ్మకం పెంపొందించాలన్నారు. సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా తాగునీటి సమస్యలు రాకుండా సమర్థవంతంగా పనిచేసిన మిషన్ భగీరథ ఇంజనీరింగ్ సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు. వారికి శాలువాలు కప్పి, మోమెంటోలు అందజేసి సత్కరించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఎస్‌ఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





