– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, అలాగే భారతీయ సంస్కృతిలో ఉన్న రామ రాజ్యం అనే భావనలను కలిపి గ్రామీణాభివృద్ధికి కొత్త రూపం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేంద్రం వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025ను తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నరేగా కింద సుమారు రూ.లక్ష కోట్లే ఖర్చు చేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత 10-11 ఏళ్లలోనే రూ.8 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఎంజీ నరేగా పథకం ప్రజలకు నిజంగా ఉపయోగపడేలా తీసుకెళ్లింది మోదీ ప్రభుత్వమేనన్నారు. ఆ పథకాన్ని పక్కన పెట్టలేదని, కేంద్రం మరింత బలోపేతం చేసి నిధులు పెంచిందని, పనుల పరిధిని పెంచిందని ఆయన వివరించారు. లబ్ధిదారుల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ రోజులను 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచిందన్నారు. ఇంత చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ అసలు వారికి సమస్య ఏంటి.. పథకం పేరులో రామ్ అనే పదం ఉండటమేనా అని ప్రశ్నించారు. రామ రాజ్యం అనే భావన మహాత్మా గాంధీ కూడా నమ్మిన సిద్ధాంతమే. అలాంటప్పుడు తాము గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి రామ్ అనే పదంపై అభ్యంతరం ఎందుకు అని రామచందర్‌రావు నిలదీశారు. ఈ పథకం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న విషయం కాంగ్రెస్‌కు తెలిసినా పథకం పేరులో ‘రామ్’ ఉందన్న కారణంతోనే వ్యతిరేకిస్తున్నదని విమర్శించారు. ప్రజా సంక్షేమం కాదు%ౌ% రాజకీయ ద్వేషమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణ తల్లి పేరు, విగ్రహం మార్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోందన్నారు. గాంధీకి నిజమైన వారసులమని చెప్పుకునే హక్కు కాంగ్రెస్‌కు ఎవరు ఇచ్చారన్నారు. మహాత్మాగాంధీ పేరు పెట్టుకుని ఫేక్ గాంధీలుగా రాహుల్ కుటుంబం వ్యవహరిస్తుదని వ్యాఖ్యానించారు. గాంధీ పేరును కుటుంబ పేరుగా వాడుకుంటారు.. రాజకీయ లబ్దికి గాంధీని ఉపయోగించుకుంటారు.. కానీ మళ్లీ గౌరవం గురించి మాట్లాడతారు అని ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఆలోచనలకు నిజమైన గౌరవం అభివృద్ధే. రామరాజ్యం స్వరాజ్యం ఆత్మతో ప్రజలకు మేలు చేసే పథకమే వికసిత్ భారత్-రామ్-జి. గాంధీజీ పేరు వాడుకోవడం కాదు.. వారి ఆలోచనలను అమలు చేసేలా ప్రజల జీవితాల్లో అభివృద్ధి దిశగా మార్పు తీసుకురావడమే బీజేపీ విధానం అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



