ఎంజీ న‌రేగా ప‌థ‌కాన్ని కొన‌సాగించాల్సిందే

– మండలిలో స్వల్పకాలిక చర్చ.. మంత్రి సీత‌క్క డిమాండ్‌
– సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః కేంద్రానికి పేదల పట్ల ప్రేమ ఉంటే ఉపాధి హామీ ప‌థ‌కం బడ్జెట్ పెంచాల‌ని, ప‌ని దినాలు పెంచాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క డిమాండ్ చేశారు. శాస‌న‌మండ‌లిలో శ‌నివారం కొత్త చ‌ట్టంపై జ‌రిగిన‌ స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో సభ్యులు లేవ‌నెత్తిన అంశాల‌కు స‌మాధానాలిచ్చారు. కొత్త చ‌ట్టం వీబీజీ రామ్ జీ వల్ల పేదల బతుకులు ఛిద్ర‌మైపోతాయ‌న్నారు. తక్కువ కూలి ఇచ్చే ఫ్యూడల్ వ్యవస్థ పురుడు పోసుకుంటుందని, కార్పొరేట్ కంపెనీలకు త‌క్కువ కూలికి కూలీల‌ను సప్లై చేసేందుకే ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీ న‌రేగా) కేంద్రం రద్దు చేసింద‌ని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, సులభతరమైన పనులు చేసే వెసులుబాటు ఉంటుంది కాబట్టి మహిళలు ఉపాధి పనుల్లో ఎక్కువగా వస్తున్నారని వివ‌రించారు. కూలీలకు కనీస వేతనం, మహిళలకు ఆత్మగౌరవం కల్పించిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాల‌ని కోరారు. బీజేపీ సభ్యులు బయటకు ఈ విషయాన్ని చెప్పలేకపోయినా అంతర్గతంగానైనా త‌మపెద్దలకు ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని చెప్పాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు పట్టణ స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు అర్బన్ సెంటర్లుగా మారుతున్నాయ‌ని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింద‌ని, ఆ హామీని నిలబెట్టుకోవాల‌ని కోరారు. వికసిత్‌ భారత్ పేరుతో పేదల జీవితాలను విధ్వంసం చేస్తున్నారన్నార‌ని, ఉపాధి చట్టాన్ని బలహీనపరచడం వల్ల వికసిత్ భారత్ సాధ్యపడదని చెప్పారు. జి రాం జి చట్టం ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీలా ఉంద‌న్నారు. జాతిపిత మ‌హాత్మా గాంధీని ద్వేషించే అవసరం బీజేపీకి ఎందుకు క‌లిగింద‌ని ప్ర‌శ్నించారు. ఉపాధి ప‌థ‌కానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాల‌న్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతోంద‌ని, అక్కడ పనులు చేయడానికి కూలీలు లేరని, అందుకే చీప్ లేబర్‌ను సప్లై చేసేందుకు ఉపాధి చట్టాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు.పేదలు ,సామాన్యులు, మహిళలు, అణ‌గారిన వర్గాల సంక్షేమం కోసం ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీన‌రేగా) యథాత‌థంగా కొనసాగించాల‌ని మంత్రి సీతక్క ప్రభుత్వం తరఫున శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, ఈ తీర్మానాన్ని స‌భ‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *