– అప్పుడే విస్తరణకు అవరోధాలు తొలగే అవకాశం
– ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్యరాజ్ పాల్గొన్నారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్ సీిఎండి ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డి.కె.సేన్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ, సిఈవో కె.వి.బి.రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. మెట్రో రైలు ఫేజ్-1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్‌అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ మెట్రోపై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ.13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతోపాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ.2,000 కోట్లు వన్-టైమ్ చెల్లింపు జరపాలని కూడా ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తిచేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుంది. 2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్ 2-ఎ, 2-బి విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కి.మీ మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండిరగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్-1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్-2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం డిఫనెటివ్ అగ్రిమెంట్ కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్-2లో కూడా ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెట్రో ఫేజ్-2లోనూ ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం తెలిపారు. ఫేజ్-1, ఫేజ్-2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు కచ్చితమైన ఒప్పందం అవసరమని కూడా సూచించారు. ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరణ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని అన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందువల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదంటూ 2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ.3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని ఎల్‌అండ్‌టీ సీఎండీ గుర్తు చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం త్వరగా వచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే