– ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ
– మ్యాచ్ ను పురస్కరించుకొని పటిష్ట భద్రత
– ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియం కు తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సి ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ బ్యాచ్ ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది, ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుంది. ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీం తో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సి సైతం ఆసక్తి చూపారని డిప్యూటీ సీఎం తెలిపారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకొని వారి వారి సీట్లలో కూర్చోవాలని డిప్యూటీ సీఎం కోరారు. లియోనల్ మెస్సి ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర విఐపి లు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పాటుచేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ఫుట్‌బాల్ క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సి పి సుధీర్ బాబు, రోహన్ రెడ్డి, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





