– ఉప్పల్ స్టేడియంలో డీజీపీ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన అధికారులతోపాటు మ్యాచ్ నిర్వాహకులు కూడా హాజరై తమ శాఖల ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్‌కు తరలివచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సికి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్ దృష్ట్యా, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకోసం మెట్రో రైళ్లలోనూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ఉప్పల్ స్టేడియం భద్రతాపరమైన అనుకూలతలను అధికారులు డీజీపీకి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉందని, సెక్యూరిటీపరంగా చాలా అనువైనదని తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే నాలుగు ప్రధాన సెక్టర్లుగా విభజించామని, దాదాపు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉందని వివరించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ సూచించారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, డీజీ ఎస్పీఎఫ్ స్వాతి లక్రా, అడిషనల్ డీజీపీ (సీఐడీ) చారు సిన్హా, అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయకుమార్, డీజీ- ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ పద్మజ, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



