కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం

– వర్చువల్‌గా ఆవిష్కర‌ణ‌
– ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ
– స్టేడియంలో అభిమానుల నిర‌స‌న‌లు

కోల్‌కతా, డిసెంబర్‌ 13: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి శనివారం ఉదయం వర్చువల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ, బంగాల్‌ సీఎం మమత బెనర్జీలను కలువనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ బయలుదేరతాడు. తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్న మెస్సి వెంట ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్‌, లూయిస్‌ సువారెజ్‌ కూడా ఉన్నారు. 14ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకొని మెస్సి.. మెస్సి అంటూ నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు.

స్టేడియంలో గంద‌ర‌గోళం

మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ తిల‌కించేందుకు అభిమానులు కోల్‌కతా నుండి మాత్రమే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది తమ అభిమాన స్టార్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకున్నారు. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకూ వెచ్చించి టికెట్ కొనుగోలు చేశారు. అయితే స్టేడియంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో మ్యాచ్ ఆడకుండానే మెస్సీ వెళ్లిపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనై కుర్చీలు ధ్వంసం చేసి వాట‌ర్‌ బాటిళ్లు విసిరేసి నిరసనకు దిగారు. మరికొందరైతే బారికేడ్లు దాటి స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. కాగా, నిర్వహణ లోపంపై సీఎం మమతాబెనర్జీ క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించడంలో విఫలమైనందుకు ఆయన్ను బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేసినట్టు కోల్‌కతా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) జావేద్ షమీమ్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. స్టేడియానికి హాజరైన ప్రేక్షకులకు నిర్వాహకులు డబ్బు రీఫండ్ చేస్తార‌ని ఏడీజీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *